BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 10:39 am Posted by : Reporter Srikanth

క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్యాష్ రివార్డులు, ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

ఇటీవల విజయవంతంగా నిర్వహించిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి, వారికి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ క్రీడలకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ-20 మంచి అవకాశంగా నిలుస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. టీజీ-20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ ఎంతో అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.