భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
2034 లక్ష్యాల సాధనకు తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2034 నాటికి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే లక్ష్యానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) నిర్మిస్తున్న డేటా సెంటర్ తొలి అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న డేటా సెంటర్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు అమెజాన్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని, 2034 నాటికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముందుకు రావాలని కోరారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అదే ఉద్దేశంతో 108 దేశాల ప్రతినిధులు, 3 వేలకుపైగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినట్లు గుర్తు చేశారు.
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం దేశ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ, దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని, 2047 నాటికి దీనిని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.
ఈ లక్ష్యాల సాధన కోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)తో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ఈ విజన్ రూపొందించామని పేర్కొన్నారు.
పెట్టుబడిదారులకు సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులు అందిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. 2025 డిసెంబర్‌లో రూపొందించిన విధానం ప్రకారం అమెజాన్‌కు భూమి కేటాయించినట్లు తెలిపారు. వచ్చే 14 ఏళ్లలో అమెజాన్ సుమారు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల పురోగతిపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ వంటి రంగాల్లో ప్రత్యేక విధానాలను తీసుకొచ్చామని, స్పష్టమైన విధానాలతోనే పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని అన్నారు. అమెజాన్ డేటా సెంటర్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తొలి మెట్టుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని సేవారంగ కేంద్రంగా అభివృద్ధి చేస్తూ, కాలుష్య పరిశ్రమలను నగరానికి వెలుపలికి తరలిస్తున్నామని తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడం, ఈవీలకు జీరో ట్యాక్స్ అమలు వంటి చర్యల ద్వారా హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఓఆర్ఆర్ వెలుపలి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని తయారీ పరిశ్రమల కేంద్రంగా, ఆర్‌ఆర్‌ఆర్ వెలుపలి ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. విద్యుత్, నీరు, భూమి, నైపుణ్యం కలిగిన యువశక్తిని అందుబాటులోకి తీసుకువచ్చి తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారికి మరింత మెరుగైన నష్టపరిహారం, భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, అమెజాన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.