హుజురాబాద్,సైదాపూర్, : తమకు చెందిన పట్టా భూమి గుండా అక్రమంగా దారి తీసుకోవడానికి యత్నించడమే కాకుండా, అడ్డుకున్నందుకు తమపై దాడికి తెగబడ్డారని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన బాధితుడు మర్రి సమ్మయ్య (తండ్రి ఓదెలు) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తమ పొలం పక్కనే వ్యవసాయం చేసుకునే నర్సింగోజు వీరబ్రహ్మం (తండ్రి రాజయ్య), నర్సింగోజు శీను (తండ్రి వీరబ్రహ్మం) అనే వ్యక్తులు.. తమ భూమిలో నుంచి అక్రమంగా దారి (తొవ్వ) తీసుకోవాలని చూస్తున్నారని సమ్మయ్య ఆరోపించారు. ఇందులో భాగంగానే పొలంలో ఉన్న గడ్డి కట్టలను తొలగించి, తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సదరు రైతుల వ్యవసాయ భూమికి ఇప్పటికే రెండు వైపుల నుంచి దారులు ఉన్నాయని.. తమ పట్టా భూమి గుండా ఎలాంటి నక్షా దారి లేదని ఆయన స్పష్టం చేశారు. తమ భూమిలో నుంచి దారి ఇచ్చేది లేదని ముందే చెప్పినప్పటికీ.. కావాలనే పోలీసు స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని సమ్మయ్య వాపోయారు.
ఇంటి అనుమతి రాకుండా అడ్డగిస్తున్నారు: రాజమణి..
సమ్మయ్య భార్య రాజమణి మాట్లాడుతూ.. తాము సొంత పట్టా భూమిలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్ (NALA), గిఫ్ట్ డీడ్ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలతో ‘మీ సేవ’ ద్వారా ఇంటి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. అయితే, పంచాయతీ విభాగానికి చెందిన కారబార్ (శ్రీనివాస్) తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు బంధువు కావడంతో, తమ దరఖాస్తును కావాలనే తిరస్కరించారని ఆమె ఆరోపించారు.
అధికారులకు విన్నవించినా ఫలితం లేదు..
ఇంటి అనుమతి కోసం ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నామని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారికి ‘ప్రజావాణి’లో కూడా ఫిర్యాదు చేశామని రాజమణి తెలిపారు. అయినప్పటికీ కారబార్ శ్రీనివాస్ అడ్డుపడుతుండటం వల్ల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం లేదని, ఇంటి అనుమతి పత్రాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు ఇంటి అనుమతి ఇప్పించాలని, తమ పట్టా భూమి గుండా అక్రమంగా దారి తీసుకోవాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.